Off The Record: ఇన్సిడెంట్స్& హ్యాపెనింగ్స్ పొలిటికల్ లైఫ్‌ని మలుపు తిప్పుతాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు రాజకీయ ప్రయాణం కూడా అలాంటిదే. పోటీ చేయడానికి సీటే లేదనుకుంటున్న టైంలో ఏకంగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించింది అధినాయకత్వం. రాజ్యసభ సభ్యుడిగా గొల్ల బాబూరావుకు మరో నాలుగేళ్ళ పదవీ కాలం వుంది. రాష్ట్రంలో ఎన్నికలు కూడా ఇప్పుడప్పుడే లేవు. అయినాసరే… బాబూరావు మాత్రం నానా హంగామా చేసేస్తున్నారట. అదీకూడా ప్రతిపక్షంలో ఉండి చేయడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఎంపీగా తన ప్రోటోకాల్‌లో వీసమెత్తు తేడా వచ్చినా… అధికారులపై కారాలు మిరియాలు నూరేస్తున్నారాయన. ఇటీవల విశాఖలో ఒక క్యాంప్ ఆఫీస్ తెరిచారు ఈ ఎంపీ గారు. ఆత్మీయ సమావేశాల పేరుతో బ్రేక్ ఫాస్ట్ మీటింగులు పెడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో వుంది. ఒక విధంగా దీనిని సంధికాలంగా భావించి నియోజకవర్గాల సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉంటుంటే… గొల్ల మాత్రం నేను చాలా డిఫరెంట్ అంటున్నారట.
Read Also: Mohan Babu: ఈ “కన్నప్ప” సినిమాలో అందరూ హీరోలే
దీంతో ఈ ఎంపీ హడావిడి వెనుక రహస్యం ఏంటా… ఆరా తీస్తున్నారు కొందరు. అసలు వాళ్ళని, వీళ్ళని ఎందుకు నేరుగా ఆయన్నే అడిగేస్తే పోలా… అనుకుంటూ ఆ ప్రస్తావన తీసుకువచ్చిన దగ్గర ఓపెన్ అవుతున్నారట గొల్ల. 2029 నాటికి కులగణన, నియోజకవర్గాల పునర్విభజన ఖాయంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే… గ్రేటర్ విశాఖ పరిధిలో రాజకీయ ముఖచిత్రం మారుతుంది. ప్రస్తుతం విశాఖ కోర్ సిటీ నాలుగు అసెంబ్లీ స్ధానాల పరిధిలో ఉంది. పునర్విభజన జరిగితే కొత్తగా ఒక సీటు పెరగడం ఖాయం. అది కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వ్డ్ సీటు అవుతుందన్న అంచనాలు వున్నాయి. సరిగ్గా ఈ పాయింటే గొల్లబాబూరావుకు ఫుల్ గా కనెక్ట్ అయిందట. అన్నీ అనుకున్నట్టు జరిగితే పార్టీలో సీనియారిటీ ఆధారంగా సీటు ఆశించడానికి తనకంటే యోగ్యత ఇంకెవరికీ లేదనేది ఈ ఎంపీగారి లాజిక్. అందుకే ముందస్తు హంగామా అంటున్నారు. బ్రేక్ ఫాస్ట్….లంచ్‌ల పేరుతో కేడర్‌ను ఆహ్వానించి….టిఫినీలు తిన్నారా….?. కాఫీలు తాగుతారా…?. అని తెగ మర్యాదలు చేసేస్తున్నారట. అంతేనా, వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ పెట్టి కేడర్ ఇబ్బందులు తీరుస్తానని ప్రకటిస్తున్నారట.
Read Also: Off The Record: వైసీపీ అధిష్టానం చెప్పినా ఆ ఇద్దరి నేతల మధ్య వైరం ఆగట్లేదా..?
ఆత్మీయ సమావేశాలు, యాక్టివ్ పాలిటిక్స్ వెనుక కొత్త సీటును ఒడిసి పట్టే వ్యూహం ఉన్నట్టు తెలుసుకుని ముక్కున వేలేసుకుంటున్నారట విశాఖ వైసీపీ కార్యకర్తలు. నాలుగేళ్ళ తర్వాత జరగబోయేదానికి ఈయన ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటున్నారన్న మాట అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగం వదిలి 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గొల్లబాబూరావు. దీంతో ఎంతైనా గవర్నమెంట్ బుర్ర అనుకుంటున్నారట. రాష్ట్రంలో వైసీపీకి అధికారం పోయాక అనేక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు ఒక్కొక్కరు కూటమికి దగ్గరయ్యారు. ఒక దశలో గొల్ల బాబూరావును కూడాఅనుమానపు చూపులు వెంటాడాయి. ఐతే, తన నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని బాహాటంగానే ప్రకటించిన బాబూరావు ఇప్పటి వరకు విధేయత విషయంలో రాజీపడలేదని చెప్పుకుంటారు. ఈ విధేయతే రేపటి విశాఖ సీటుకు అడ్వాంటేజ్ అవుతుందన్నది ఆయన లెక్క అట. మొత్తం మీద నాలుగేళ్ళ ముందే కుర్చీలో కర్చీఫ్ వేయడం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాయి విశాఖ రాజకీయ వర్గాలు.