జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ అత్యుత్తమ బౌలర్ అని, అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమని ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అన్నాడు. ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమని పేర్కొన్నాడు. ఓ ఓవర్లో ఆడరాని బంతులు కనీసం 3-4 వేస్తాడని, ఎలాంటి బంతి వేస్తాడో అంచనా వేయడం చాలా కష్టం అని డకెట్ ప్రశంసించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ కాగా.. గొప్పగా బౌలింగ్ చేసిన బుమ్రా ఐదు వికెట్స్ పడగొట్టాడు. 24.4 ఓవర్లు వేసి 3.40 ఎకనామితో 83 రన్స్ ఇచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లోనే డకెట్ (62) బోల్డ్ అయ్యాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైక్ అథర్టన్, నాజర్ హుస్సేన్‌లతో జరిగిన సంభాషణలో బెన్ డకెట్ మాట్లాడుతూ జస్ప్రీత్ బుమ్రాపై ప్రసంశలు కురిపించాడు. ‘ప్రపంచంలో జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ బౌలర్. ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లోనైనా అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఓ ఓవర్లో బుమ్రా ఆడరాని బంతులు కనీసం 3-4 వేస్తాడు. బౌన్సర్ వేస్తాడా?, యార్కర్ విసురుతాడా?, స్లో డెలివరీ సంధిస్తాడా? లేదా ఇన్, ఔట్ స్వింగర్లు వదలుతాడా? అని అంచనా వేయడం చాలా కష్టం. ఒక్కో బంతిని ఒక్కోలా వేస్తాడు. బుమ్రాతో చాలా కష్టం’ అని బెన్ డకెట్ తెలిపాడు.
Also Read: Sourav Ganguly: వీవీఎస్ లక్ష్మణ్ నాతో 3 నెలలు మాట్లాడలేదు!
‘ఉత్తమ బౌలింగ్ దాడిని ఎదుర్కొని సెంచరీ చేయడం బాగుంటుంది. ఓ ఆటగాడికి అంతకు మించిన ఆనందం ఏం ఉంటుంది?. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కు నిలిచిన ఓలీ పోప్‌కు ఇలాంటి సంతోషమే దక్కింది. పోప్ చాలా ప్రశాంతంగా ఆడి సెంచరీ చేశాడు. కొత్త బంతిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. అందులోనూ బుమ్రా బౌలింగ్‌ను. చాలా జాగ్రత్తగా ఆడల్సి ఉంటుంది. మ్యాచ్ గెలవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం’ అని బెన్ డకెట్ చెప్పుకొచ్చాడు. తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (47), శుభ్‌మన్ గిల్ (6) క్రీజులో ఉన్నారు.